ఎలకలే కదా తీసిపారేయద్దు...వాటితోనూ స్కామ్ చేసి కోట్లు దండుకోవచ్చు

updated: March 24, 2018 21:40 IST

కాదేది కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. కాదేదీ స్కామ్ కు అనర్హం అంటున్నారు మన శ్రీశ్రీశ్రీ రాజకీయనాయకులు. అవును..మొన్నామధ్యన లాలూప్రసాద్ యాదవ్ గారి పశువుల దాణా స్కామ్ చూసి ఆశ్చర్యపోయిన దేశ జనాలకి మహారాష్ట్ర ప్రభుత్వం ఎలుకల స్కామ్ తో మేము అంతకన్నా ఓ మెట్టు ఎక్కువే అని షాక్ ఇచ్చింది. 

 

 మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఎలుకల స్కామ్ పై ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే  అసెంబ్లీ సమావేశాల్లో... సచివాలయం ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపి దేశం మొత్తం హాట్ టాపిక్ గా మార్చారు.  సచివాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు  కాంట్రాక్ట్‌ సంస్థ చెప్పడంతో వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ఖడ్సే తెలిపారు. అసలు మంత్రాలయంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత మంది పని చేస్తున్నారు, ఆ స్థాయిలో అసలు ఎలుకలు ఉన్నాయా అంటూ ఆయన   కాంట్రక్ట్‌ సంస్థపై మండిపడ్డారు. 

అలాగైతే రోజుకి ఎన్ని ఎలుకలు చంపారు, ఏ విధంగా చంపారు, చంపిన ఎలుకలను ఎక్కడికి తరలించారో తెలపాలని సదురు సంస్థను ప్రశ్నించారు. సరాసరి రోజుకు 45,628.57 ఎలుకలను చంపారనుకుంటే అందులో 0.57 మాత్రం కొత్తగా పుట్టిన ఎలుక పిల్లలు అయి ఉంటాయని ఖడ్సే అనడంతో సభలోని అందరినీ నవ్వించారు. ముంబై మహా నగరంలోని ఆరు లక్షల ఎలుకలను చంపడానికి  ముంబాయి మున్సిపల్‌ కార్పోరేషన్‌(బీఎంసీ)కే రెండు సంవత్సరాలు పట్టిందని ఖాడ్సే ఈ సందర్భంగా గుర్తు చేశారు

comments