ఆ వృధ్ద దంపతులు పెట్టుకున్న అర్జీ చదివితే..కన్నీళ్లు ఆగవు

updated: March 5, 2018 22:31 IST
ఆ వృధ్ద దంపతులు పెట్టుకున్న అర్జీ చదివితే..కన్నీళ్లు ఆగవు

కొన్ని వార్తలు కేవలం వార్తలుగానే  ఉంటాయి..మరికొన్ని మన హృదయాన్ని తడిమి, మన మనస్సుని మెలిపెట్టే సన్నివేశాలుగా కనపడతాయి. అవి చదువుతూంటే కన్నీరు అడ్డం పడి మసగ మసగ్గా   అక్షరాలు  మారిపోతాయి. అలాంటి వార్త ఒకటి రీసెంట్ గా జాతీయ మీడియాలో కనిపించింది. ఆ వార్తను యధాతధంగా అందిస్తున్నాం..

వాళ్లిద్దరూ అన్యోన్య దాంపత్యం గడుపుతున్న  వృధ్ద దంపతులు.. వాళ్లు సమాజానికి ఓ ప్రశ్న వేసారు లేదు లేదు సమాధానం వెతుక్కున్నామంటున్నారు. ‘‘మేం బతకడం వల్ల మాకు గానీ సమాజానికి గానీ ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే, మేం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. అందుకు మాకు అనుమతివ్వండి’’ అని అడుగుతున్నారు ఎవరు వాళ్లు అంటే.. ముంబైకి చెందిన నారాయణ్‌ లవాటే (88), ఐరావతి (78) అనే వృద్ధ దంపతులు. వారిద్దరూ  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఓ అర్జీ పెట్టుకున్నారు. 

అలాగని  వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? అంటే అదీ లేదు. ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇంట్లో తమ పనులను తామే స్వయంగా చేసుకుంటున్నారు. అయితే, వారికి పిల్లలు లేరు. తోబుట్టువులు చనిపోయారు. ఈ నేపథ్యంలో.. తమకు ఇంకా బతకాలనే ఆశ లేదని, వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యానికి గురయ్యే దాకా బతకడమూ సమంజసం కాదని భావిస్తున్నట్టు వారు పిటిషన్‌లో కోరారు.

తామిద్దరం ఉరివేసుకొని, లేదంటే భవంతిపై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవచ్చని, అలా చేస్తే చనిపోతామనే గ్యారంటీ లేదన్నారు. అందుకే.. చట్టబద్ధమైన పద్ధతిలో ఐచ్ఛిక మరణానికి (యాక్టివ్‌ యుథనేసియా), లేదంటే వైద్యుల సాయంతో ఆత్మహత్య (అసిస్టెట్‌ సూసైడ్‌)కు అనుమతివ్వాలని ఈ మేరకు గత నెల డిసెంబరు 21న పెట్టుకున్న అర్జీలో రాష్ట్రపతిని కోరారు. 

ఇక నారాయణ్‌.. మహారాష్ట్ర ఆర్టీసీలో పనిచేసి 1989లో రిటైరయ్యారు. ఆయన భార్య ఐరావతి గతంలో ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ దంపతులు దక్షిణ ముంబైలోని చార్మీ రోడ్‌లో ఉంటున్నారు.

  నారాయణ్‌ మీడియాత ోమాట్లాడుతూ.. ఇష్టపూర్వకంగా తనువును చాలించాలనే వారి కోసం స్విట్జర్లాండ్‌లో డిగ్నిటాస్‌ అనే సంస్థ ఉందని, అందులో తాను, తన భార్య సభ్యులమన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారికి అక్కడి వైద్యులు ఎలాంటి చార్జీలు లేకుండా సహకరిస్తారన్నారు. అయితే, పాస్‌పోర్టు లేని కారణంగా తాము అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారికి ప్రాణభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని, ఆయన అదే విచక్షణాధికారంతో జీవితాలను ముగించేందుకు అనుమతివ్వాలని కోరారు. మరణానంతరం శరీరాలను దానం చేయాలని, తర్వాత తమ ఆస్తిని రాష్ట్ర ఖజానాకు స్వాధీన పరచాలని తాము ఇప్పటికే నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.

 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments